గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని అశ్రద్ధ చేసి ప్రజల ప్రాణాలు బలితీసుకుంది : పుల్లారావు.
కూటమిప్రభుత్వం రూ.1180కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణ, మరమ్మతుపనులు చేపట్టింది
త్వరలోనే పీపీపీ మోడల్ లో ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనుంది
చిలకలూరిపేట ఫిబ్రవరి 16 (అఖండ భూమి న్యూస్):
నియోజకవర్గంలో ఎక్కడా రోడ్లపై గుంతలు ఉండటానికి వీల్లేదని, ప్రధాన రహదారులకు ధీటుగా వాటిని అనుసంధానించే అన్ని గ్రామాల, మండల కేంద్రాల రోడ్లు ఉండాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఆదివారం ఆయన నాదెండ్ల మండలంలోని కనపర్రు-సాతులూరు ఆర్&బీ రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించారు. గత ప్రభుత్వం ప్రధాన రహదారులు సహా, అన్నిరకాల రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చకుండా గాలికి వదిలేసిందని, గోతులమయమైన రోడ్లపై ప్రయాణించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పుల్లారావు తెలిపారు. కూటమిప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, సంక్రాంతి నాటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లసమస్యను పరిష్కరించిందన్నారు. ఫిబ్రవరి నాటికి రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా ఉండేలా ప్రభుత్వం వేగంగా పనులు చేయిస్తోందని పుల్లారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,180 కోట్లతో గుంతల రహిత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనులు చేపట్టిందన్న మాజీమంత్రి, పలు ప్రధాన రహదారులను పీపీపీ మోడల్ లో అభివృద్ధి చేయనుందని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు 80శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులన్నీ కూడా త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేనా ఇంచార్జి తోట రాజా రమేష్, టిడిపి నాయకులు బండారూపల్లి సత్యనారాయణ, కామినేని సాయి బాబు తదితులున్నారు.