వలసలు వెళ్లకుండా పనులు కల్పించండి
పనులు కల్పించకపోతే చర్యలు తప్పవు
గ్రామాలకు వెళ్లి పనులకు వచ్చేలా అవగాహన కల్పించండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్ ఫిబ్రవరి 21 (అఖండ భూమి వెబ్ న్యూస్) : వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని, పనులు కల్పించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు..
శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలు, హౌసింగ్ అంశాలపై ఏపిడి లు, ఎంపీడీఓ లు, ఏపివో లు, హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పనుల కోసం కూలీలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు..టెలి కాన్ఫరెన్స్ లు, సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఎలా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు..ఒక వైపు వలసలు వెళుతుంటే జాతరలు, ఉత్సవాలు అని కారణాలు వెతుక్కుంటే అంగీకరించను అని కలెక్టర్ హెచ్చరించారు..
రోజుకు లక్ష మందికి పనులు కల్పించే లక్ష్యంతో పని చేయాలన్నారు..ప్రతి గ్రామ పంచాయతీ లో పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు..ఏ పంచాయతీలో అయినా పనులు జరగకపోతే వాటి వివరాలను ఇవ్వాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు.. ఉపాధి పనులు కల్పించనందున వలసలు వెళుతున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, పనులు కల్పించకపోవడం వల్ల వలసలు వెళితే ఎంపీడీవో, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ల మీద చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు..గ్రామాలకు వెళ్లి పనులకు వచ్చేలా అవగాహన కల్పించాలని ఏపిడి లు, ఎంపీడీఓ లు, ఏపివో లను ఆదేశించారు.. గ్రామాల పర్యటన వివరాలతో వీరు టూర్ డైరీ లను కూడా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు..
పనులు కల్పించడంలో సి.బెలగల్, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు, దేవనకొండ, ఆదోని, తుగ్గలి, పెద్దకడబూరు, నందవరం, ఓర్వకల్లు, కౌతాళం, కోడుమూరు మండలాలు వెనుకబడ్డాయన్నారు…సంబంధిత మండలాల ఎంపిడిఓలు, ఏపివో లతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెల చివరికి వచ్చినప్పటికీ కూడా ఇంకా 60 శాతం మాత్రమే పనులు కల్పించడం ఏంటని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..రోజు వారీ, వారపు లక్ష్యాల సాధనలో వెనుకబడిన సందర్భంగా పెద్ద కడుబూరు ఎంపిడిఓ, కౌతాళం ఏపీఓ కి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు….నందవరం, కోసిగి, కర్నూలు, కృష్ణగిరి, ఓర్వకల్లు, కౌతాళం, ఎమ్మిగనూరు, కల్లూరు మండలాల్లో జిల్లా యావరేజ్ కంటే తక్కువగా పనులు కల్పించారని, పురోగతి చూపించాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓ లను ఆదేశించారు.. ఆదోని మండలం ఇప్పటి వరకు 75 శాతం మాత్రమే పనులు కల్పించారని, అన్ని అంశాలలోనూ ఈ మండలం వెనుకబడి ఉందని కలెక్టర్ ఎంపిడిఓ ను ప్రశ్నించారు… ఆదోని మండలానికి సంబంధించి ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు..మస్టర్ అప్డేషన్ లో కూడా పత్తికొండ, ఆస్పరి, ఓర్వకల్లు, మంత్రాలయం వెనుకబడి ఉన్నాయని, వీరి నుండి వివరణ కోరాలని, ఈ అంశంపై తనిఖీ చేసి నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు…
ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించాలని చెప్పమని, అయినప్పటికీ ఈ అంశంలో వెనుకబడి ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..75 కంటే ఎక్కువ పని దినాలు కల్పించిన వారి పై దృష్టి పెట్టి, 100 రోజులు పని దినాలు కల్పించిన వారి సంఖ్య పెరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు..
గోకులం నిర్మాణాల్లో పురోగతి బాగానే ఉందన్నారు.. కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయని, పెండింగ్లో ఉన్న గోకులం లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎమ్మిగనూరు, కర్నూలు క్లస్టర్ లలో గోకులం నిర్మాణాల పురోగతి బాగుందన్నారు.. సోక్ పిట్ లు 3 వేలు శాంక్షన్ చేస్తే కేవలం 270 మాత్రమే పూర్తి చేయడమేంటని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. పత్తికొండ, దేవనకొండ, గూడూరు, మంత్రాలయం, కౌతాళం, కోడుమూరు, సి బెలగల్ మండలాల్లో ఒకటి కూడా పూర్తి చేయలేదని, ఈ అంశంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులను ఆదేశించారు..అలాగే ఫామ్ పాండ్ ల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..
హౌసింగ్ కి సంబంధించి జనవరి నుండి ఇప్పటివరకు హౌసింగ్ నిర్మాణాల్లో పురోగతి బాగా సాధించామన్నారు..ఇళ్ళ నిర్మాణంలో 4200 లక్ష్యానికి 1900 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. ఆదోని సబ్ డివిజన్ లో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి బాగా సాధించారని, మిగిలిన సబ్ డివిజన్ లలో కూడా ఇదే విధంగా పురోగతి సాధించాలన్నారు.. కోడుమూరు, కర్నూలు, ఆలూరు, నందవరం, హోళగుంద, గూడూరు, ఆదోని, గోనెగండ్ల తదితర మండలాల్లో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి చూపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి పొసెషన్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్ తహశీల్దార్ లను ఆదేశించారు.. రాష్ర్ట ప్రభుత్వం రూరల్ లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్ల స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయన్నారు..హౌస్ సైట్స్ రీ వెరిఫికేషన్, లబ్ధిదారుల గుర్తింపుపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ లను ఆదేశించారు..
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డ్వామా పిడి వెంకట రమణయ్య, హౌసింగ్ పిడి అజయ్ కుమార్, మండల స్పెషల్ అధికార్లు, ఎంపిడిఓ లు,హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.