కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి పైసా కేటాయించలేదు
ఇది దగా ప్రభుత్వం
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి
రాష్ట్రంలో పాలన చేస్తోంది కూటమి ప్రభుత్వం కాదని,
అది దగా ప్రభుత్వమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపధ్యంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి వేల కోట్లు అవసరమని కూటమి మంత్రులే వెలిగొండ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్పారని, మరి బడ్జెట్లో రూ.359 కోట్లు మాత్రమే మంజూరు చేయడంలో గల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలోనే రెండు టన్నెల్ల నిర్మా ణం పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయి నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి పైసా కేటాయించలేదన్నారు. అట్లాంటిది బడ్జెట్లో కేవలం రూ. 359 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిధు లు ఏ మూలకు సరిపోతాయని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ ప్యాకెజీ ద్వారా నిర్వాసితుల కోసం రూ. వెయ్యి కోట్లు అవసరం కాగా కేవలం రూ. 116 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పా రు.. దీనిని బట్టి చూస్తే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగదీత ప్రాజెక్టుగా కాలం గడపడం తప్ప మరొకటి లేదన్నారు. 4.4 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే పశ్చిమ ప్రాంత వరప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై వారు చెప్పే మాటలకు, సిద్దాంతాలకు పొంతనలేదన్నారు. కేవలం పశ్చిమ ప్రాంతంలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నందునే ఈ ప్రాజెక్టు నిర్మాణం పట్ల అశ్రద్ద చూపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి వేగవంతంగా పూర్తి చేసి పశ్చిమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రణాళికను రూపొందించుకొని త్వరలోనే పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.